మకరజ్యోతి కనిపించే ముందు శ్రీ అయ్యప్పస్వామి వారికి తిరువాభరణములు’ అలంకరించటం సాంప్రదాయం. ఆనాడు పందళ మహారాజు రాజశేఖరునకు ఇచ్చిన మాట ప్రకారము నేటికీ ఈ కార్యక్రమమును ఆ రాజవంశీయుల పర్యవేక్షణలో జరుగును. పందళంలోని రాజవంశీయుల కుటుంబములో ఈ తిరువాభరణపు పెట్టెలు వుంటాయి. పందళం వెళితే మనం చూడవచ్చును. మకర సంక్రాంతికి ముందుగా దేవస్థానం అధికారులకు పందళం రాజవంశీయులు వారి ఆధీనంలోని తిరువాభరణపు పెట్టెలు స్వాధీనం చేస్తారు. తరువాత ఒక సంవత్సరకాలము పూర్తి నియమనిష్టలతో వుండే వాహకులు ఈ తిరువాభరణపు పెట్టెలు మోస్తారు. మొదట శబరిమలైకి 88 కి.మీ. దూరములో నున్న పందళంలోని “వెలయకోయికెల్ ధర్మశాస్తా” ఆలయంలో వుంచి పూజలు చేసి, జనులదర్శనానికి వుంచుతారు. జనవరి 12 మధ్యాహ్నాం పోలీసు బందోబస్తుతో పూజచేసిన తర్వాత తిరువాభరణాల ఊరేగింపు ప్రారంభమౌతుంది. మొదటి రోజు రాత్రి “అయిరూరు పుదియన్ కావు” దేవాలయంలో గడపుతారు. జనవరి 13 ఉదయమే పూజ జేసి ప్రారంభమైన ఊరేగింపు మధ్యాహ్నానికి “పెరువట్టాల్” దేవస్థానంలో కాసేపు విశ్రాంతి తీసికొని , పూజ అయిన తర్వాత ముందుకు సాగుతుంది. ఆ రాత్రి ‘లాహ’ ఎస్టేట్ లో విశ్రాంతి తీసుకుంటారు. జనవరి 14 ఉదయం పూజచేసి , కొంత ప్రయాణం చేసిన తర్వాత “నీలక్కల్” శివమందిరంలో కొద్దిసేపు ఆగి , పూజ అయిన తర్వాత “సిరియాన వట్టమ్ (శ్రీ మణికంఠుడు బాలుడుగా దొరికిన స్థలము) లో కాసేపు విశ్రమించి సాంప్రదాయక పూజలు చేసి , అడవిదారి ద్వారా శబరి పీఠాన్ని చేరుతారు. అక్కడ దేవస్థానం అధికారులు పూజలు చేసి , తిరువాభరణం ఊరేగింపుకు స్వాగతం పలుకుతారు. ఊరేగింపు వాయిద్యగోష్టులతో , శరణుఘోషలతో వైభవంగా సాగుతుంది.

ఈ తిరువాభరణం పెట్టెలు శబరి పీఠమునకు కొద్ధిసేపటిలో వస్తాయనగా ఆకాశంలో రెండు గరుడ పక్షులు ఎగురుతూ కన్పిస్తాయి. అవి అలా గాలిలో ఎగురుకుంటూ పోయి సన్నిధానము చేరి , స్వామి వారి దేవాలయ శిఖరముపై ప్రదక్షిణ చేసి తిరిగి వెళ్ళిపోతాయి. సాక్షాత్తూ అనంత పద్మనాభస్వామి తనవాహనమైన గరుత్మంతునిపై , తన కుమారుని దర్శించుకోవటానికి వత్తురని భక్తుల విశ్వాసము.

ముఖ్యంగా పేట తుళ్ళిలో ప్రముఖులైన అలంఘాట్ వారు ఈ గరుడపక్షలు ఆకాశములో కన్పించనిచో వాళ్ళు ఇరుముడులు స్వామి వారికి నివేదించరట . అనంత పద్మనాభ స్వామి, అంటే శ్రీ మహావిష్ణువు రాలేదు కనుక ఇరుముడిని సమర్పించటంలో విలువేముందని వాళ్ళు వెళ్ళిపోతారట. నిజంగా అనుభవములో చాలా మందిని విచారిస్తే శబరిమలలో ఇతర సమయములలో అలాటి పక్షుల జోడి కన్పించదు. మరి విచిత్రంగా , భగవల్లీలగా , నేనున్నానని ప్రత్యక్ష సాక్ష్యం భగవంతుడు ఇస్తున్నాడన్నట్లుగా ఆ గరుడపక్షులు ఆ సమయంలో రావటము శబరిగిరీశునికి ప్రత్యక్ష నిదర్శనం కాక ఇంకేముంటుంది ? ఆ పక్షులు వెళ్లిపోతుండగానే దారిలో గల భక్తులు తిరువాభరణపు పెట్టెలు వస్తున్నాయని తెలుసుకొని , శరణుఘోష దద్దరిల్లుతుండా , ఎక్కడికక్కడే స్వామివారికి హారతులివ్వాలని కర్పూర జ్యోతులు వెలిగించి శరణాలు చెబుతు దారి పొడవునా ఉత్కంఠతో నిలుచుని ఎదురు చూస్తుంటారు. ఆ పెట్టెలు రాగానే వాటిని దర్శించాలని , తాకాలని , ఒకరికొకరు పోటీపడి ముందుకు నెట్టుకుంటూ శరణఘోషలు చేస్తూ ఒళ్ళు మరిచిపోయి కేకలు వేస్తు పరుగులు తీస్తుంటారు. ఇక ఆభరణాల పెట్టెలు మోసేవారికి చూస్తుంటే మహాశ్చర్యం వేస్తుంది. అంతటి పెద్ద పెట్టెలను అవలీలగా మోస్తూ చేతులతో పట్టుకోకుండా విన్యాసాలు చేస్తు వారు పరుగులతో వస్తుంటే , చూసేవారి శరీరము గగుర్పొడుస్తుంది.

సన్నిధానంలో మధ్యాహ్నం 12 గంటలకే దర్శనము నిలిపివేసి , పదునెట్టాంబడి వరకు శుభ్రముచేసి ముగ్గులు పెడతారు. భక్తులు దారికిరువైపులా శరణుఘోష సల్పుతూ కర్పూర జ్యోతులు ప్రకాశింపచేస్తుండగా తిరువాభరణపు పెట్టెలు తీసుకువచ్చి పదునెట్టాంబడి నధిరోహించి , స్వామివారి దేవళములో ప్రవేశించగానే తలుపులు మూస్తారు. కొద్ధి సేపు పూజ అనంతరము సరిగా 5-15 నుండి 6 గంటలు సంధ్యా సమయములో భళ్ళున గలగలమంటూ గంటలు మ్రోగుచుండగా తలుపులు తెరుచుకుంటాయి. స్వామికిక కర్పూర హారతి ఇస్తూ స్వామిని సేవిస్తుంటారు. సరిగా అదే సమయములో కాంతమలలో కొండశిఖరముపై జ్యోతి దర్శనం అవుతుంది. జ్యోతిదర్శనమునకు కొద్ది నిముషముల ముందుగా ఆకాశంలో , కాంతమల కొండ శిఖరముపై ఒక నక్షత్రము కన్పిస్తుంది. కొద్దిసేపు ఆ నక్షత్రము కన్పించి కనుమరుగవగానే జ్యోతి కనిపిస్తుంది. ఎపుడైతే నక్షత్రం కనిపిస్తుందో అది సంకేతంగా భావించి స్వాములందరూ శరణుఘోష బిగ్గరగా చెబుతూ , తమ వద్దగల కర్పూర జ్యోతులను స్వామికి అర్పించటానికి వెలిగించి సిద్ధంగా వుంటారు. ఊపిరి బిగపట్టి , గుండెలు పగిలే ఉత్కంఠతో జ్యోతి దర్శనం కోసం ఏ మాత్రం చూపు మరల్చకుండా ఆ కాంతమల శిఖరము వైపే దృష్టి సారించి ఉంటారు. జ్యోతి కనిపిస్తుంది. ఒకటే కోలాహలం శరణుఘోష , కర్పూర జ్వాలలు , మేళాలు , తాళాలు , ఒకటేమిటి ? శరణుఘోషతో శబరిమల ప్రతి ధ్వనించిపోతుంది. ఓ క్షణం కనిపించిన జ్యోతి అదృశ్యమై పోతుంది కొద్ది క్షణాలలో మరలా కన్పిస్తుంది. ఇనుమడించిన భక్త్యావేశంతో స్వాములు శరణుఘోష సల్పుతూ , కర్పూర జ్యోతులు వెలిగించి తనవితీరా జ్యోతిని దర్శించుకున్న తృప్తితో యిక బయలుదేరుతారు. కొద్ది విరామం తరువాత తిరువాభరణములతో అలంకరించిన స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని ఆఖరిసారిగా దర్శించుకొని , తిరిగి మిమ్ము దర్శించుకునే మహాభాగ్యాన్ని ప్రసాదించు స్వామి ! అంటూ ప్రార్థించి వెనుతిరుగుతారు. నిజంగా జ్యోతిదర్శనం మాటలకు అందని ఓ గొప్ప మధురానుభూతి ! ప్రతివారి హృదయములోను యాత్ర పరిపూర్ణ ఫలిత మొసంగిన తృప్తి ఏర్పడును.

పిదప కన్నెస్వాములు వచ్చి యున్నారా యని పరిశీలించుటకు బయలుదేరు మాళికాపురం అమ్మవారి ఊరేగింపులో పాల్గొని , మకర విళక్కు అను దీపమును , అమ్మవారి పట్టపుటేనుగును దర్శించి , ఇరుముడితో స్వామివారి దర్శనమునకుపోయి , తిరువాభరణము లతో స్వామివారిని దర్శించి , మెట్ల మీద తిరుగుపడి కాయ కొట్టి వెనకవైపుగా స్వామివారిని చూస్తు పయనమయ్యెదరు.. (మహిషిని సంహరించగానే , మహిషి శరీరము నుండి లీలావతి ఉద్భవించి అయ్యప్ప స్వామి వారిని , వివాహమాడ వలసినదిగా కోరినదనీ ఆయన అందుకని నిరాకరించి , తన కోవెలలో మంజమాతగా పూజలందుకోవలసినదని , ఏ సంవత్సరము తనను దర్శించుటకు కన్నెస్వాములురారో అపుడు ఆమెను వివాహం చేసుకుంటానని మాటయిచ్చాడని ఐతిహ్యం. (అందుకే ఈ సాంప్రదాయాన్ని అక్కడ కొనసాగిస్తున్నారట).

⚜️ తిరువాభరణ పెట్టె ఆగమనము ⚜️

స్వామివారికి అలంకరించబడు తిరువాభరణములు పందళ దేశ రాజు యొక్క వంశము వారి ఆధీనములో యుండును. మకర విళక్కు ఉత్సవమునకు (అనగా జనవరి 14వ తేదీన) ముందుగా పందళ దేశమునుండి తిరువాభరణములు మహా కోలాహలముతో వైభవముగా గొని వచ్చి అలంకరించి మరల పందళ దేశపు రాజధానికి గొనిపోయి భద్రపరచెదరు. ఈ తిరువాభరణములు అందమైన మూడు పెట్టెలలో ఉండును. తిరువాభరణ పెట్టెని పందళదేశపు సన్నిధికి మోసుకొని వచ్చువారు ఒక ఏడాది కఠినమైన వ్రతానుష్ఠానములు గైకొనిన పిదపనే మోసుకుని రాగలరనియూ , నియమము , వ్రత భంగము గలిగినవారు తిరువాభరణ పెట్టెని స్పర్శించుటకు సాధ్యము కాదనియూ చెప్పెదరు. మకర సంక్రాంతి దినమున సంధ్యా సమయమునకు తిరువాభరణ పెట్టి స్వామి సన్నిధానమునకు చేరును. తిరువాభరణము యొక్క ఆగమనమును చూచుటకునూ , స్వామివారి దీపారాధనను దర్శించుటకునూ అయ్యప్ప భక్తులు ఆలయము యొక్క పురోభాగము నందు సంఘటిత మయ్యెదరు. అందరూ అచ్చట సౌకర్యముగా నిలబడి చూచుటకునూ , నమస్కరించుట కునూ వసతి తక్కువగా నున్ననూ , స్వామివారి యొక్క తిరువాభరణము ఉండు పెట్టెను ఒక కంటితో చూచి ఆనందించు భాగ్యము సిద్ధించక యుండదు. నిశ్చల మనస్కులై అచ్చట కూడియున్న వారందరూ ప్రవర్తించడం మూలముగా దానికి ఎటువంటి ఆటంకమూ కలుగదు. స్వామియొక్క అవర్ణనీయమైన మహత్మ్యములలో మిక్కిలి ప్రాధాన్యము చెందిన కార్యక్రమము ఈ తిరువాభరణ పెట్టెయొక్క ఆగమనము. తిరువాభరణ పెట్టెయొక్క రాక ఏవిధముగా ఉండునో తెలుసుకొనని వారు నిర్భాగ్యవంతులనియే చెప్పవచ్చును.

ముప్పదియవ దినమున సంధ్యవేళ దీపారాధనకు ముందుగా తిరువాభరణ పెట్టెతో ఎగురుతూ (కఠిన వ్రత దీక్షకుడు) పదునెనిమిది మెట్లను దాటుదురు. మెట్లెక్కి వచ్చెడి ఆ వ్యక్తి ఎగురుతూ వచ్చుచున్నది చూసినచో అతనియొక్క శిరముపై ఉండే పెట్టె ఇదిగో ఇప్పుడో , అప్పుడో , క్రింద పడిపోవును అని మనకనిపించును. కాని అది శిరమునుండి నేలపై పడదు. ఎందువలన ? ఆలోచించుడు. అవును , నిశ్చయముగా తారక బ్రహ్మ స్వరూపియైన ఆ హరిహరసుత అయ్యప్ప స్వామివారి యొక్క దివ్య శక్తియే , దివ్య లీలయే , గొప్ప సత్యమే సందేహము వలదు. తిరువాభరణ పెట్టెతో గూడా ఆ ఆభరణములకు రక్షకునివలె గరుత్మంతుడు ఆకాశములో ఆ పెట్టెపై ఎగురుతూ శబరిగిరి సన్నిధి చేరేంతవరకూ వచ్చి సురక్షితముగా ఆ తిరువాభరణములు స్వామి సన్నిధి చేరిన పిదప , ఆ శబరి క్షేత్రమును మూడు పర్యాయములు ప్రదక్షిణము చేసి అదృశ్యమగుట నేడు గూడా మనము కనులారా గాంచి తరించవచ్చును. ఇటువంటి దైవలీలలు ఈ శబరిగిరి యాత్రలో ఎన్నెన్నో జరుగును. తిరువాభరణపెట్టెయొక్క రాకను చూచి నమస్కరించుకొని పోలీసులు , కడుత్త స్వామి , కరుప్పస్వామి మొదలగువారి యొక్క వెలిచ్చపాడులు (కాగడాలు పట్టుకొనువారు) గూడా వెంబడించుట కానవచ్చును. తిరువాభరణ పెట్టెని మోసుకొని వచ్చిన వ్యక్తి పెట్టెను నేల దించిన వెంటనే అచేతనుడై స్పృహ తప్పి పడిపోవును. భగవంతునికి తిరువాభరణములను అలంకరించి దీపారాధన ముగిసిన పిదపనే అతనికి స్పృహ వచ్చును. ఆహా ! ఏమి భగవంతుని లీలా వైభవము. భక్తాదులు స్వయముగా చూచి గ్రహించవలసిన అద్భుత సంఘటన ఇది.

#Ayyappa Devotional, #Ayyappa Swamy, #Ayyappa Thiruvabharanam, #Lord Ayyappa, #Makara Jyothi, #Makara Vilakku, #Pandalam Palace, #Sabarimala, #Sabarimala Temple, #secrets of Ayyappa Thiruvabharanam, #Thiruvabharanam