రాజస్థాన్‌లోని కోట ప్రభుత్వ న్యూ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో సిజేరియన్ (C-Section) ప్రసవాలు చేయించుకున్న ఐదుగురు బాలింతలు, తమకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించాలని లేదా దయామరణానికి (Euthanasia) అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయని వారు ఆరోపించారు.

మే 5 నుంచి 7 మధ్య కోట న్యూ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో సిజేరియన్ ప్రసవాలు చేయించుకున్న ఈ మహిళలు అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. నకిలీ లేదా నాసిరకం మందులు ఇవ్వడం వల్ల తీవ్రమైన కిడ్నీ నష్టం జరిగిందని, ప్రస్తుతం ప్రతి 48 గంటలకు ఒకసారి డయాలసిస్‌పై ఆధారపడాల్సి వస్తోందని వారు తమ లేఖలో పేర్కొన్నారు.

“మా బాధను ఇక భరించలేకపోతున్నాం. వెంటనే కిడ్నీ మార్పిడి చేయాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. తగిన నష్టపరిహారం ఇవ్వాలి. ఇవేవీ సాధ్యం కాకపోతే గౌరవంగా మరణించే హక్కు కల్పించండి” అని వారు రాష్ట్రపతిని వేడుకున్నారు.

బాధితుల్లో ఒకరైన రాగిణి మీనా మాట్లాడుతూ, “కోట కలెక్టర్, స్థానిక ఎంపీ, రాజస్థాన్ ముఖ్యమంత్రిని ఎన్నిసార్లు కలిసినా న్యాయం జరగలేదు. కిడ్నీ వైఫల్యం, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఆక్సిజన్ సపోర్ట్, ప్రతి రెండు రోజులకు డయాలసిస్… ఈ బాధలతో జీవించడం అసాధ్యంగా మారింది. మా భర్తలు ఉద్యోగాలు వదిలి మా దగ్గరే ఉండటంతో కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి” అని ఆవేదన వ్యక్తం చేశారు.

ధన్నీ బాయి భర్త మోహన్ లాల్ మాట్లాడుతూ, “నా భార్యకు 72 రోజులుగా ఆసుపత్రిలోనే చికిత్స జరుగుతోంది. ప్రతి డయాలసిస్ తర్వాత ఆమె తీవ్రంగా వాంతులు చేసుకుంటోంది. రాత్రిళ్లు నిద్రపట్టడం లేదు. ఇక డయాలసిస్ చేయించుకోమని, కిడ్నీ మార్పిడి మాత్రమే చేయాలని ఆమెతో పాటు మిగతా మహిళలు కూడా నిర్ణయించుకున్నారు” అని తెలిపారు.

ఇదే సమయంలో రాజస్థాన్‌లో ప్రసవాల అనంతరం మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత వారం భిల్వారా జిల్లాలో ఐదుగురు, బన్స్వారాలో నలుగురు బాలింతలు మరణించారు. గత రెండు నుంచి మూడు నెలల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలకు సంబంధించిన మరణాల సంఖ్య 19కి చేరినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది.

#C Section, #Cesarean Delivery, #Dialysis, #Euthanasia, #Kidney Failure, #Kota Medical College Hospital, #Organ Transplant, #President Droupadi Murmu, #Rajasthan Hospital